ప్రజాతెలంగాణ – కరీంనగర్ : తెలంగాణను ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్-2047 విజన్‌తో ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా కరీంనగర్లో మాట్లాడిన మంత్రి, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ఆర్టీసీ ఉచిత ప్రయాణం, 500 రూపాయలకు గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించామని, ఇందులో 150 బస్సులు ఇప్పటికే అందజేశామని అన్నారు.
అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లో 25.35 లక్షల రైతులకు రూ. 20,617 కోట్ల రుణమాఫీ చేశామని, ఇది దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోతుందని వివరించారు. రైతుభరోసా కింద ఎకరానికి రూ. 12,000 సహాయం, ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతు ఖాతాలో నగదు జమ చేస్తున్నట్టు తెలిపారు.
దేశంలో తొలిసారి ఎస్సీ వర్గీకరణ చేసిన రాష్ట్రం తెలంగాణ అని, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు. మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులతో లక్ష ప్రైవేటు ఉద్యోగాలు సృష్టిస్తున్నామని పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లాలో 7,626 స్వయం సహాయక సంఘాలకు రూ. 785.66 కోట్లు, 7,999 మంది మహిళలకు రూ. 66.18 కోట్ల స్త్రీనిధి రుణాలు మంజూరు చేశామని తెలిపారు. జిల్లాలో 77,726 మంది రైతులకు రూ. 605.71 కోట్ల రుణమాఫీ చేశామని, 11,575 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని అన్నారు.
అమెరికా, దక్షిణ కొరియా, సింగపూర్, జపాన్ దేశాలలో పెట్టుబడులు సాధించామని, హైదరాబాద్‌లో AI గ్లోబల్ సమ్మిట్, బయో ఏషియా, ప్రపంచ సుందరి పోటీలను విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు.
మరింత :


