
కలెక్టరేట్ ఎదుట మెడికల్ రిప్రెజెంటేటివ్స్ ధర్నా..
మూడు రోజుల పాటు నిరసనలకు పిలుపు
కార్మిక హక్కులు, ఉద్యోగ భద్రతను దెబ్బతీసేలా కొత్త చట్టాలు ఉన్నాయని ధ్వజం
సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ (SPE) యాక్ట్ 1976ను పునరుద్ధరించాలని డిమాండ్
24, 25, 26 తేదీల్లో నల్ల బ్యాడ్జీలతో విధులు నిర్వహించాలని పిలుపు
అడిషనల్ కలెక్టర్కు వినతిపత్రం అందజేత
కరీంనగర్ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రెజెంటేటివ్స్ యూనియన్ (TMSRU) కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. కార్మిక వర్గానికి, మెడికల్ రిప్రెజెంటేటివ్స్కు తీవ్ర నష్టం కలిగించే ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని యూనియన్ నాయకులు నినదించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చీకోటి శ్రీధర్ మాట్లాడుతూ, కార్మిక వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు.
హక్కులను కాలరాసేలా కొత్త చట్టాలు
నాలుగు కొత్త లేబర్ కోడ్లు దేశంలోని కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేసేలా ఉన్నాయని చీకోటి శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కును, తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేసే హక్కును కూడా ఈ చట్టాలు కాలరాస్తున్నాయని విమర్శించారు. ముఖ్యంగా మెడికల్ & సేల్స్ రిప్రెజెంటేటివ్స్ రక్షణ కోసం ఉద్దేశించిన సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ (SPE) యాక్ట్ 1976ను రద్దు చేయడం ఆందోళనకరమన్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులకు కనీస వేతనం, బోనస్, గ్రాట్యుటీ వంటి చట్టబద్ధమైన సౌకర్యాల అమలు ప్రశ్నార్థకంగా మారుతుందని పేర్కొన్నారు.
మూడు రోజుల పాటు నిరసనలు
కేంద్రం తన వైఖరిని మార్చుకునేంతవరకు పోరాటం ఆగదని నాయకులు స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 24, 25, 26 తేదీలలో మెడికల్ & సేల్స్ రిప్రెజెంటేటివ్స్ అందరూ విధుల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెంటనే దిగివచ్చి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ధర్నాకు మద్దతు తెలిపిన సీఐటీయూ (CITU) జిల్లా అధ్యక్షుడు యు. శ్రీనివాస్ మాట్లాడుతూ.. లేబర్ కోడ్లను రద్దు చేయని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ప్రధాన డిమాండ్లు ఇవే:
కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి.
సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ యాక్ట్ (SPE Act) 1976ని పునరుద్ధరించాలి.
మెడికల్ అండ్ సేల్స్ రిప్రెజెంటేటివ్స్కు చట్టబద్ధమైన పని విధానాలను రూపొందించాలి.
అడిషనల్ కలెక్టర్కు వినతిపత్రం
ధర్నా అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి రాసిన వినతిపత్రాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్కు యూనియన్ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎంఎస్ఆర్యూ రాష్ట్ర కార్యదర్శులు జి. విద్యాసాగర్, జి. శ్రీనివాస్, ఏ. సదానందచారి, జిల్లా బాధ్యులు కె. వెంకటేశ్వర్లు, అంజయ్య మిరుపాల, ఉపాధ్యక్షులు పి. హరీష్, సహాయ కార్యదర్శులు పి. నరేందర్, కె. మదన్ మోహనాచారి, కోశాధికారి కె. సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


