యువత డ్రగ్స్ బారిన పడకుండా చూడాలి
– జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
ప్రజాతెలంగాణ – కరీంనగర్ :
మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, యువత మత్తుపదార్థాల బారిన పడకుండా కాపాడాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.మత్తు పదార్థాల నిర్మూలనలో భాగంగా పోలీస్, ఎక్సైజ్ సహా వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్, ఎక్సైజ్ విద్యాశాఖ అధికారులు సమన్వయంతో కళాశాలు, వివిధ వసతి గృహాలను సందర్శించాలని అన్నారు. అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి విద్యార్థులు పెడదోవ పట్టకుండా చూడాలని ఆదేశించారు.
కళాశాల ప్రిన్సిపాల్ లు, ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలని, డ్రగ్స్ బారిన పడిన అనుమానాలు ఉంటే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మాధకద్రవ్యాలకు అలవాటు పడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన కూడా ఉందని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా సమావేశం నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. స్నేహిత కార్యక్రమంలో భాగంగా ఇదివరకే అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మరో దఫా అవగాహన కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. మాదకద్రవ్యాల నిరోధక కమిటీలను బలోపేతం చేయాలని తెలిపారు. జిల్లాలోని విద్యార్థులకు డాగ్స్ వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులందరికీ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని సూచించారు.పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ పోలీసు శాఖ తరపున అధికారులందరి సమన్వయంతో ఇప్పటికే జిల్లాలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో మాధకద్రవ్యాల నియంత్రణకు మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మారుస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, ఎక్సైజ్ జిల్లా సూపరింటెండెంట్ శ్రీనివాస్, డీఎస్పీ మాధవి, డిడబ్ల్యుఓ సబిత, డీఈఓ జనార్ధన్, డిఎంహెచ్వో వెంకటరమణ పాల్గొన్నారు.