ప్రజాతెలంగాణ- కరీంనగర్ : అసంఘటిత రంగాల్లో పనిచేస్తూ ఈ-శ్రమ్ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకున్న, ప్రమాదవశాత్తు మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యం పొందిన కార్మికులకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నదని జిల్లా ఉపకార్మిక కమిషనర్ కోల ప్రసాద్ తెలిపారు. ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన క్రింద ఆగస్టు 26, 2001 నుండి మార్చి 31, 2022 మధ్య ఈ-శ్రమ్ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకున్న, ప్రమాదవశాత్తు మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యం పొందిన అసంఘటిత కార్మికుల కుటుంబాలకు/కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నదని కమిషనర్ వివరించారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, అంగవైకల్యం పొందిన కార్మికులకు రూ. 1 లక్ష అందిస్తున్నదని తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని అర్హులైన అసంఘటిత కార్మికులు దరఖాస్తు సమర్పించడానికి జూన్ 30, 2025 వరకు గడువు పొడిగించినట్లు పేర్కొన్నారు . అర్హులైనవారు దరఖాస్తుతో పాటు మరణ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఈ-శ్రమ్ కార్డు, ఎఫ్.ఐ.ఆర్, పంచనామా, పోస్టుమార్టం రిపోర్ట్, నామినీ బ్యాంక్ అకౌంట్ వివరాలను జతచేసి ఉపకార్మిక కమిషనర్ కార్యాలయం లో జూన్ ౩౦, సాయంత్రం 5 గంటల లోపు అందజేయాలని కమిషనర్ కోల ప్రసాద్ ఈ సందర్భంగా తెలిపారు.
మరిన్ని వార్తల కోసం :
కొత్తపల్లి పిహెచ్‌సిని సందర్శించిన డిఎంహెచ్ఓ డా.వెంకటరమణ