ప్రజా తెలంగాణ -కరీంనగర్ : ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. జూన్ 6 నుండి 19 వరకు నిర్వహించనున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లో శుక్రవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో బాల బాలికలను ప్రభుత్వ పాఠశాలల్లో, ఆరేళ్లలోపు పిల్లలను అంగన్వాడీల్లో చేర్పించేట్లు చూడాలని అన్నారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లోని మెరుగైన సదుపాయాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ర్యాలీలు, బ్యానర్లు, విద్యావాహిని వాహనాల ద్వారా డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించాలని అన్నారు.పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, నోట్ పుస్తకాలు ఇప్పటికే పాఠశాలలకు చేరాయని, పాఠశాల ప్రారంభ రోజే విద్యార్థులకు అందించాలని తెలిపారు. బాల కార్మికులను, 5-14 ఏళ్ల బడి బయట పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, జిల్లా విద్యాధికారి మొండయ్య, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, విద్యాశాఖ కోఆర్డినేటర్లు అశోక్ రెడ్డి ఆంజనేయులు, సిడిపిఓలు మండల విద్యాధికారులు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :