ప్రజాతెలంగాణ – రామడుగు : ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని తయారు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వంట చేసే సిబ్బందికి సూచించారు.మంగళవారం జిల్లాలోని అన్ని కేజీబీవీలు, బాలికల రెసిడెన్షియల్ హాస్టళ్లలో వంట చేసే 90 మంది సిబ్బందికి రామడుగు మండలం వెదిర గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి హాజరై సిబ్బంది వంట చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. శిక్షణలో భాగంగా వంట సిబ్బంది తయారుచేసిన భోజనాన్ని రుచి చూశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వంట సిబ్బంది వ్యక్తిగతంగా పరిశుభ్రత పాటిస్తూ వంటగది పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. వంట చేసేందుకు పరిశుభ్రమైన నీరు వాడాలని, నాణ్యతతో కూడిన భోజనం తయారు చేయాలని అన్నారు. డైట్ మెనూలో పేర్కొన్న విధంగా వివిధ రకాల పిండి వంటలు, పలహారం వంటివి రుచికరంగా చేయాలన్నారు. శిక్షణలో నేర్చుకున్న ప్రకారం వంట చేయాలని సూచించారు. కేజీబీవీలలో స్థలం ఉన్నందున వంటకు ఉపయోగకరమైన కరివేపా వంటి మొక్కలు నాటాలని, స్వీట్ పొటాటో వంటి పాదులు వేయాలని, కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రాజేశ్వరి, జిల్లా బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి, కేజీబీవీ ప్రిన్సిపాల్ కవిత పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :