కరీంనగర్ లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి వేడుకలు

ప్రజాతెలంగాణ – కరీంనగర్ :

కరీంనగర్ లోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తాలో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ 118 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పేయి, అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, వివిధ ప్రజా సంఘాల నాయకులు, ఎస్సీ ఎస్టీ సంఘాల నేతలు, అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ చిన్న వయసులో కేంద్ర మంత్రివర్గంలో అనేక పదవులు చేపట్టిన బాబు జగ్జీవన్ రామ్ భారత అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. చదువు ద్వారానే జగ్జీవన్ రామ్ అంతటి కీర్తి సంపాదించారని, ఎస్సీ ఎస్టీ, బీసీ విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని తెలిపారు. ఇందులో భాగంగానే రిజర్వేషన్లను పెంచాలనే డిమాండ్ కేంద్రం వద్ద బలంగా వినిపిస్తున్నామని అన్నారు. బలహీన వర్గాలు అభివృద్ధి చెందేలా 6 గ్యారంటీల అమలుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం నిరంతరం పాటుపడుతూ ఉందని తెలిపారు.
 చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో, నవభారత నిర్మాణంలో బాబు జగ్జీవన్ రామ్ కీలక పాత్ర పోషించారని అన్నారు. చిన్న వయసులో కార్మిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి కీలక చట్టాలను అమలు చేశారని గుర్తు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజల వైపు నిలబడిన జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ, కుల గణన ఇందులో భాగమేనని తెలిపారు. దళితుల పక్షపాతిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాల అమలుకు కట్టుబడి ఉందని అన్నారు. జిల్లాలో దళితుల సమస్యలపై ముందుండి పరిష్కరిస్తామని తెలిపారు.

        జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ చిన్న వయసు నుండి చదువుపై శ్రద్ధ పెట్టిన బాబు జగ్జీవన్ రామ్ ఎన్నో కీలక పదవులు చేపట్టారని గుర్తు చేశారు. చదువు ద్వారానే ఆయనలో ప్రశ్నించే పోరాడే తత్వం వచ్చిందని తెలిపారు. సుదీర్ఘ కాలం పాటు పార్లమెంటేరియన్ గా ప్రజాసేవ చేశారని అన్నారు.  మహిళలు చదువుకోని రోజుల్లో తన కుమార్తె మీరా కుమారిని చదివించారని అన్నారు. జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో మీరా కుమారి లోక్ సభ మహిళ మొదటి స్పీకర్ గా ఎన్నికైన విషయాన్ని గుర్తు చేశారు. పేద విద్యార్థుల సంక్షేమం పట్ల జిల్లా యంత్రాంగం ఎప్పుడూ శ్రద్ధ చూపుతూనే ఉందని అన్నారు. చదువుతోనే సమాజంలో సమానత్వం వస్తుందని తెలిపారు.

  పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ సామాజిక న్యాయానికి, భారత అభివృద్ధికి బాబు జగ్జీవన్ రామ్ పోరాటం గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. అన్ని వర్గాల వారి హక్కులను ఆయన కాపాడారని తెలిపారు. వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవానికి నాంది పలికారని అన్నారు.
అనంతరం కులాంతర వివాహం చేసుకున్న ఐదుగురు దంపతులకు వివాహ ప్రోత్సాహక బహుమతి చెక్కులను అందజేశారు. ఈనెల 14న నిర్వహించనున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ర్యాలీకి సంబంధించిన పోస్టర్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డిఓ మహేశ్వర్, ఎస్సీ అభివృద్ధి అధికారి పవన్ కుమార్, ఎస్సీ ఎస్టీ సంఘాల నేతలు, ప్రజాసంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం :

కరీంనగర్ : డ్రోన్ల వినియోగంపై నిషేధాజ్ఞలు

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!