– కలెక్టర్ పమేలా సత్పతి
ప్రజాతెలంగాణ- కరీంనగర్ రూరల్ : భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా పైలట్ మండలం సైదాపూర్ లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.భూ భారతి పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులలో భాగంగా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామపంచాయతీ భవనంలో, బొమ్మకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు కలెక్టర్ హాజరయ్యారు..
రైతులు, ప్రజలతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. భూ భారతి చట్టంపై రైతుల సందేహాలను నివృత్తి చేశారు. భూ సమస్యలు పరిష్కరించి, రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తోందని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే అన్ని మండలాల్లో నూతన చట్టం గురించి అవగాహన కల్పించామని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సైదాపూర్ మండలాన్ని పైలెట్ ప్రాతిపదికన ఎంపిక చేసి గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ రెవెన్యూ సదస్సుల్లో భూ రికార్డులలో పేరు తప్పులు,విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నెంబర్ మిస్సింగ్, పట్టా పాస్ బుక్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్-బి లో చేర్చిన భూముల సమస్యలు, భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు.
భూభారతి కొత్త ఆర్.ఓ.ఆర్ చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, నిర్దేశిత గడువులోపు భూ సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. వివిధ కారణాల వల్ల రెవెన్యూ సదస్సులో అర్జీలు సమర్పించే అవకాశం లభించని వారు తరువాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, అధికారులు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలన, విచారణ కోసం వచ్చే రెవెన్యూ బృందాలకు సహకరించాలని కలెక్టర్ కోరారు. భూ సమస్యలను పరిష్కరించుకుని, భూ వివాదాలు లేని గ్రామాలుగా పల్లెలను తీర్చిదిద్దుకోవాలని సూచించారు. పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సులను మండలంలోని అన్ని గ్రామాల రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సైదాపూర్ లోని రెవెన్యూ గ్రామాలలో ఈ నెల 20 వ తేదీ వరకు సదస్సులు పూర్తయ్యాక, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని మిగతా అన్ని మండలాలలో రెవెన్యూ గ్రామాల వారీగా సదస్సులు నిర్వహిస్తామని అన్నారు.
సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలిస్తూ, సత్వర పరిష్కారానికి అనువుగా ఉన్న వాటిని వేరుగా నమోదు చేసి రెవెన్యూ సదస్సులో ముగిసేలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మీ సేవా, ఆన్లైన్లో నమోదు చేయాల్సిన అవసరం ఉంటే రైతులకు సహకరించి నమోదు అయ్యేట్టుగా చూడాలని తెలిపారు. సదస్సులో హుజూరాబాద్ ఆర్డీవో రమేష్ బాబు, తహసిల్దార్లు కనకయ్య, శ్రీనివాస్, రెవిన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :