ప్రజాతెలంగాణ- కరీంనగర్ : ఇటీవల అనారోగ్యంతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ జి. రాజిరెడ్డి కుటుంబానికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మంగళవారం కార్పస్ ఫండ్ చెక్కును అందజేశారు. రామడుగు మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన రాజిరెడ్డి కరీంనగర్ కమిషనరేట్‌లోని ట్రాన్స్‌పోర్ట్ విభాగంలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తూ గత డిసెంబర్ నెలలో అనారోగ్యంతో కన్నుమూశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ, రాజిరెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్పస్ ఫండ్ ద్వారా మంజూరైన ఈ ఆర్థిక సహాయం వారి కుటుంబానికి కొంతైనా ఊరట కలిగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.మృతి చెందిన రాజిరెడ్డి భార్య వజ్రమ్మకు కమిషనర్ స్వయంగా చెక్కును అందజేశారు. ఈ విషాద సమయంలో పోలీస్ శాఖ తమకు అండగా నిలవడం పట్ల వజ్రమ్మ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బి సెక్షన్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్, బి సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు.