ప్రజాతెలంగాణ – కరీంనగర్ రూరల్ : అన్ని సౌకర్యాలతో కూడిన ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. కరీంనగర్ రూరల్ మండలం మొగ్ధంపూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పాఠశాల పున:ప్రారంభ కార్యక్రమంలో ఆమె పాల్గొని విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు పంపిణీ చేశారు.
ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యంతో వినూత్న కార్యక్రమాలు
ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్, జిల్లాలో వినూత్న రీతిలో ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డెడ్ఎడ్, ఒలంపియాడ్, కంప్యూటర్ వంటి విభిన్న రంగాలతో పాటు క్రీడా పోటీల్లో కూడా విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నట్లు వివరించారు.ప్రభుత్వ పాఠశాలలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ,పుస్తకాలూ యూనిఫాం ఉచితంగా అందజేస్తూ పైసా ఖర్చు లేకుండా చదువుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
బడిబాట కార్యక్రమంలో ఇంటింటికి పర్యటన
బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటిని సందర్శిస్తూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపేలా తల్లిదండ్రులను ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాలలోని కంప్యూటర్ గదిని కూడా పరిశీలించారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.పద్మ,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :