ప్రజా తెలంగాణ – వెబ్ డెస్క్ : ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో జిల్లా కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, వ్యవసాయ శాఖ కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు.గత సంవత్సరం కంటే 22 లక్షల మెట్రిక్ టన్నుల అధికంగా మొత్తం 64.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు సీఎం తెలిపారు. 10.5 లక్షల మంది రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసి, 48 గంటల్లో చెల్లింపులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. అసత్య ప్రచారాలను తిప్పికోట్టాలని, రైస్ మిల్లుల పర్యవేక్షణ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10,000 పరిహారం అందించేందుకు నివేదిక తయారు చేసి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వానాకాలం సాగుకు రైతులకు అవసరమైన విత్తనాలు, యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నకిలీ విత్తనాల అమ్మకంపై పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
ఇందిరమ్మ ఇళ్ల అమలులో మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీల ఏర్పాటు చేయాలని, లబ్ధిదారులకు టోకెన్ ద్వారా ఉచిత ఇసుక సరఫరా చేయాలని తెలిపారు. అక్రమ ఇసుక రవాణాను ప్రోత్సహించే ఆస్కారం లేదని స్పష్టం చేశారు. 1.3 లక్షల మంది లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసినట్లు రిపోర్టు వచ్చిందని వెల్లడించారు.భూభారతి చట్టం పేదలకు చుట్టంలా పని చేస్తుందని, జూన్ 2 నుంచి 20 వరకు మూడో విడత రెవెన్యూ సదస్సుల నిర్వహించాలని ఆదేశించారు. పైలెట్ మండలాల్లో వచ్చిన భూ సమస్యల దరఖాస్తుల పరిష్కరించాలని సూచించారు.జిల్లా కలెక్టర్లు, ఇంచార్జ్ మంత్రులు మే 29-30లో క్షేత్ర పర్యటనలు చేసి జూన్ 1 నాటికి సమగ్ర రిపోర్టు సమర్పించాలని అన్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు.
సమావేశంలో పౌర సరఫరాల మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , రెవెన్యూ హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ,కలెక్టర్ లు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :