ప్రజాతెలంగాణ -కరీంనగర్: తెలంగాణను సమగ్ర అభివృద్ధి దిశగా నడిపించేందుకు విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు .కరీంనగర్‌లోని ప్రతిమ మల్టీప్లెక్స్‌లో తెలంగాణ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తానాకాన్’ 11వ వార్షిక సదస్సు ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.వైద్యం సేవా దృక్పథంతో కూడినదని, వైద్యులు సమాజ శ్రేయస్సు కోరుకుంటారని , వారి సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆరోగ్య మంత్రి దామోదర్‌రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, అనుమతులు, లైసెన్స్ సంబంధిత సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, వైద్యుల సూచనలను జిల్లా కలెక్టర్లతో చర్చించి తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యా, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ భారీ మార్పులు తీసుకువస్తున్నదని వివరించారు. అన్ని వర్గాలకు విద్యా సదుపాయాలు అందేలా నూతన విధానాలను అమలు చేస్తున్నామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెంచి నిపుణుల సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.
ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యేలు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, డాక్టర్ హరిష్‌బాబు, డాక్టర్ సంజయ్‌కుమార్, డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ చిన్న, మధ్యతరగతి ఆసుపత్రుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.ఈ సదస్సులో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆర్డీవో మహేశ్వర్, తానాకాన్ రాష్ట్ర అధ్యక్షులు అరుణ్‌కఠారి, ఆర్గనైజింగ్ చైర్మన్ ఎలగందుల శ్రీనివాస్, కార్యదర్శి చాట్ల శ్రీధర్, ఆర్గనైజింగ్ ట్రెజరర్, డాక్టర్ రాజకుమార్, ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎనమల్ల నరేష్ పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :