ప్రజాతెలంగాణ – కరీంనగర్ క్రైమ్ : బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ రూరల్ సీఐ ఏ.నిరంజన్ రెడ్డి హెచ్చరించారు . సోమవారం కరీంనగర్, కొత్తపల్లి మండలాల్లోని బెల్ట్ షాపు నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 24 గంటలూ తెరిచి ఉండే బెల్ట్ షాపుల వల్ల గ్రామాల్లో మద్యం విచ్చలవిడిగా అమ్ముడవుతోందన్నారు . దీని వల్ల యువత జీవితాలు నాశనమవుతున్నాయని ,మద్యం సేవించిన వారు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని, కొందరు గంజాయికి కూడా బానిసలవుతున్నారని సీఐ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిలో గొడవలు పెరుగుతున్నాయని, దీని వల్ల పోలీస్ కేసులు అధికమవుతున్నాయని వివరించారు.తల్లిదండ్రులు పిల్లలను చెడు అలవాట్లకు దూరంగా ఉంచాలని, సెల్ ఫోన్లు ఇవ్వకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. గ్రామాలు ఆరోగ్యంగా ఉండాలంటే బెల్ట్ షాపులు ఉండకూడదని, ప్రజలందరూ ఐకమత్యంతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఎవరైనా బెల్ట్ షాపులు నడిపినట్లు రుజువైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని సీఐ స్పష్టం చేశారు. ఈ అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి ప్రజల, మీడియా సహకారం అవసరమని అన్నారు.ఈ సమావేశంలో సుమారు 100 మంది బెల్ట్ షాపు నిర్వాహకులు హాజరయ్యారు. కొత్తపల్లి ఎస్ఐ ఎస్.సాంబమూర్తి, కరీంనగర్ రూరల్ ఎస్ఐ పి.లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :