ప్రజా తెలంగాణ – కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి కొత్త రెవెన్యూ చట్టం ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. భూ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మంగళవారం కరీంనగర్ రూరల్ మండలం దుర్షెడు ప్రాథమిక పాఠశాలలో, కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన భూభారతి గ్రామ రెవెన్యూ అవగాహనా సదస్సుల్లో కలెక్టర్ పాల్గొన్నారు.
జిల్లాలో విజయవంతమైన పైలెట్ ప్రాజెక్ట్
భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని రూపొందించిందని కలెక్టర్ వివరించారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన సైదాపూర్ మండలంలో, అన్ని మండల కేంద్రాలలో రెవెన్యూ అవగాహనా సదస్సులు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన భూ సమస్య అర్జీలను రెవెన్యూ అధికారులు పరిష్కరిస్తున్నారని అన్నారు.జూన్ 20 వరకు అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. భూ సమస్యలున్న ప్రజలు ఈ సదస్సులకు హాజరై దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న కలెక్టర్
ఆసిఫ్‌నగర్, దుర్షెడు గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ప్రజలు భూ సమస్యలకు సంబంధించిన అర్జీలను సమర్పించారు. అర్జీదారుల సమస్యలను కలెక్టర్ స్వయంగా విని తెలుసుకున్నారు. ప్రజలకు, అధికారులకు అవసరమైన సూచనలు, సలహాలు అందించారు.రెవెన్యూ అధికారులు ప్రజల దరఖాస్తులను స్వీకరించి వెంటనే రసీదులు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. సకాలంలో సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.రెవెన్యూ సదస్సులో హెల్ప్‌డెస్క్, రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించి, రైతుల భూ సమస్యల దరఖాస్తులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, తహసీల్దార్లు ఎన్.రాజేష్, ఆర్.వెంకటలక్ష్మి, రెవెన్యూ సిబ్బంది, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :
నవోదయ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం