ప్రజా తెలంగాణ – కరీంనగర్ : ఇటీవల కేంద్రం లోక్ సభ, రాజ్య సభ లో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈనెల 13న హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై నిర్వహించనున్న మిలియన్ మార్చ్ ను విజయవంతం చెయ్యాలని కరీంనగర్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండి తాజుద్దీన్ అన్నారు.శనివారం మైనారిటీ నేతలతో కలిసి కరీంనగర్ డిసిసి కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఇమ్రాన్ ప్రతాప్ గరి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ , టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరవుతారని తెలిపారు.
వక్ఫ్ సవరణ బిల్లు పేరుతో ముస్లింల వక్ఫ్ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తోందన్నారు. దేశవ్యాప్తంగా 25% వక్ఫ్ భూములు ఇతరుల కబ్జాలో ఉన్నాయని ఆక్రమణకు గురైన వక్ఫ్ ఆస్తులపై విచారణ చేపట్టి ఆస్తులను తిరిగి అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు.వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా అంచలంచెలుగా నిరంతర ప్రక్రియగా ఉద్యమాలు చేపడతామన్నారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు నిహాల్ అహ్మద్, ల యీక్ ఖాద్రి, అబ్దుల్ రెహమాన్, కలిముద్దీన్ మహమ్మద్ ,అమీర్ మహమ్మద్ ,చాంద్ మహమ్మద్ పాషా ,హనీఫ్ షబానా బేగం , తదితరులు పాల్గొన్నారు.