ప్రజా తెలంగాణ – జగిత్యాల: కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ భూసమస్యలు పరిష్కరించాలని, ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు .శుక్రవారం రాత్రి జగిత్యాల కలెక్టరేట్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో రెవెన్యూ సదస్సులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణకుమార్, ఆది శ్రీనివాస్‌తో పాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరయ్యారు.
మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, “జిల్లా కలెక్టర్లు మానవీయ కోణంలో భూసమస్యలు పరిష్కరించాలి. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో భూసమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి” అని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్లు సమన్వయంతో కలిసి పనిచేస్తూ భూసమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.పైలెట్ మండలాల్లో భూభారతి చట్టం, రెవెన్యూ సదస్సుల నిర్వహణ తీరును మంత్రి సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న భూసమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లకు సూచనలు, సలహాలు అందజేశారు.నిర్లక్ష్యంగా వ్యవహరించే రెవెన్యూ అధికారులపై కఠినంగా వ్యవహరించాలి. అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసేలా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు, రైతుల సంక్షేమం కోసమే అధికారులు పనిచేయాలని సూచించారు.కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ , పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లతా, పలువురు అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :


