– కరీంనగర్ రూరల్ సిఐ ఏ నిరంజన్ రెడ్డి
ప్రజా తెలంగాణ -కరీంనగర్ క్రైమ్ : ఈమధ్య కాలంలో జరుగుతున్న వివిధ రకాల సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ రూరల్ సిఐ ఏ నిరంజన్ రెడ్డి అన్నారు. సెల్ ఫోన్లో వస్తున్న వివిధ రకాల మెసేజ్ లను గుడ్డిగా నమ్మి తెరవకూడదని సూచించారు.
బుధవారం నాడు కొత్తపల్లి మండలం రేకుర్తి లోని లయోలా కాలేజీ ఆవరణలో దేశ సైన్యం, రక్షణ విభాగాల్లో ఉద్యోగాల ఎంపిక కోసం శిక్షణ పొందుతున్న యువకులకు సైబర్ మోసాలు , మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగం – దుష్పరిణామాలు అంశం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రూరల్ సిఐ ఏ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు తమ కష్టార్జితంతో సంపాదించి బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులను తస్కరించేందుకు సైబర్ నేరగాళ్లు పలు రకాల ఎత్తుగడలతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అనునిత్యం అప్రమత్తత అవగాహన కలిగి ఉండాలని అన్నారు .
తమ కుటుంబ సభ్యులు లేదా బంధువులు డిజిటల్ అరెస్ట్ అయ్యారంటూ సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడుతున్నారని, చట్టపరంగా డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదని స్పష్టం చేశారు. సెల్ ఫోన్, ఏ టి యం, క్రెడిట్ కార్డులకు సాధారణ పాస్ వర్డ్ లను వినియోగించకూడదని, తమకు మాత్రమే పరిమితం కాబడిన పాస్ వర్డ్ లను ఎంపిక చేసుకున్నట్లయితే ఎలాంటి మోసాలకు గురవ్వకుండా ఉంటారని తెలిపారు. బ్యాంకు ఖాతాల నుండి సైబర్ నేరగాళ్లు డబ్బులను తస్కరించినట్లయితే వెంటనే 1930 నెంబర్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆకర్షణీయమైన ప్రకటనలను గుడ్డిగా నమ్మి మోసపోవద్దని తెలిపారు. ప్రజల బలహీనతలను ఆసరా చేసుకుని మోసగాళ్లు ఎత్తుగడలతో పన్నాగం పన్నుతున్నారని తెలిపారు.
యువత మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. వివిధ రకాల మత్తులకు బానిసలై యువత చేజేతుల భవిష్యత్తును నిర్వీర్యం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చక్కటి క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్చుకొని జీవితాలను ఆశయాలకు అనుగుణంగా తీర్చి దిద్దుకోవాల్సిన సమయంలో చెడు సహవాసాలతో గాడి తప్పడం విచారకరమని , వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నత విద్యాబ్యాసాలతో భావి భారత నిర్మాణంలో కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కొత్తపల్లి ఎస్ ఐ ఎస్ సాంబమూర్తి, శిక్షణ విభాగం ఇన్చార్జి సతీష్ రెడ్డి ,కళాశాల సిబ్బంది ,యువకులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :