– బాధితులకు అందిస్తున్న సేవలు, కేసుల పురోగతిపై సమీక్ష
ప్రజా తెలంగాణ -కరీంనగర్ క్రైమ్ : కొత్తపల్లిలోని భరోసా కేంద్రాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలంగాణ పోలీస్ శాఖలోని ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో గత డిసెంబర్ నెలలో ప్రారంభమైన ఈ కేంద్రం పనితీరును, బాధితులకు అందిస్తున్న సేవలను ఆయన అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ కేంద్రంలోని సిబ్బందితో మాట్లాడి, రికార్డులను పరిశీలించి, వాటిని సక్రమంగా నిర్వహించాలని సూచించారు. కేసుల వివరాలను పరిశీలించిన ఆయన, నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలని, బాధితులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
భరోసా కేంద్రాలు మంచి సత్ఫలితాలనిస్తున్నాయి
కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ, లైంగిక వేధింపులకు గురైన మహిళలు, అసభ్యకరమైన లైంగిక ప్రవర్తనకు లోనైన పిల్లలకు పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రులకు దూరంగా సురక్షితమైన వాతావరణంలో చేయూత అందించేందుకే తెలంగాణ రాష్ట్ర పోలీసుశాఖ, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కమిషనరేట్ మరియు జిల్లాల్లో ఈ భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది అని పేర్కొన్నారు.బాధితులకు సేవలందించడంలో భరోసా కేంద్రాల ఏర్పాటు మంచి సత్ఫలితాలనిస్తోందని , లైంగిక వేధింపుల కేసుల్లో శిక్షల శాతం గణనీయంగా పెరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఏసీపీ మాధవి, ఇన్‌స్పెక్టర్ శ్రీలత, ఎస్సై అనూష తదితర సభ్యులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :