ప్రజా తెలంగాణ – కరీంనగర్ రూరల్ : ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతాన్ని పెంచి నాణ్యమైన విద్యను అందించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు .విద్యాశాఖ ఆధ్వర్యంలో కొత్తపెల్లిలోని సెయింట్ జార్జ్ పాఠశాలలో నిర్వహిస్తున్న ఐదు రోజుల ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమంలో బుధవారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధనతో పాటు తాము కూడా కొత్త అంశాలను నేర్చుకోవడం అవసరం. ప్రభుత్వం అధిక నిధులు కేటాయించి అనేక సదుపాయాలు కల్పిస్తోంది. తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించేలా చర్యలు తీసుకోవాలి” అని పేర్కొన్నారు.ప్రాథమిక పాఠశాల దశ విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అని, విభిన్న నైపుణ్యాలతో ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండాలని సూచించారు. “పాఠశాలలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న శిక్షణా సామగ్రిని సద్వినియోగం చేసుకోవాలి. గురువులు విద్యార్థులకు సంరక్షకులుగా వారిని సన్మార్గంలో నడిపించాలి. సేవా దృక్పథంతో కూడిన ఉపాధ్యాయ వృత్తి అమూల్యమైనది” అని ఆమె వివరించారు.
ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యంలో వేసవి శిక్షణ
ప్రైవేటు-ప్రభుత్వ ఒప్పందంలో భాగంగా సెయింట్ జార్జ్ పాఠశాలలో సుమారు 60 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బాస్కెట్ బాల్, స్విమ్మింగ్, పుస్తక పఠనం వంటి అంశాలపై వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. కలెక్టర్ విద్యార్థులతో సంభాషించి, వారి శిక్షణ ప్రగతిని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, సెయింట్ జార్జ్ పాఠశాల చైర్మన్ ఫాతిమారెడ్డి, మండల విద్యాధికారులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :