ప్రజా తెలంగాణ – కరీంనగర్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు వీటిని వినియోగించుకునేలా వైద్యాధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు.శుక్రవారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వైద్య శాఖ పనితీరు మరియు మాతృ శిశు సంక్షేమ చర్యలపై సమీక్ష నిర్వహించారు.ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని మెడికల్ ఆఫీసర్లకు సూచించారు. ఆసుపత్రులను ఇంటిలా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే ప్రజలు వస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అత్యాధునిక వైద్య సేవలను ప్రజలు ఉపయోగించుకునేలా మరింత అవగాహన కల్పించాలని సూచించారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా అసంక్రమిత వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, మందులను క్రమం తప్పకుండా అందించాలని ఆదేశించారు. రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. డెంగూ, మలేరియా నియంత్రణకు మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా మహిళలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలు అత్యధికంగా జరిగేలా దృష్టి సారించాలని పేర్కొన్నారు.ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల వైపు వెళ్లకుండా ప్రభుత్వ సదుపాయాలను ఉపయోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో డిఎంహెచ్‌వో వెంకటరమణ, డిసిహెచ్ వీరారెడ్డి, డెమో రాజగోపాల్, ఇతర వైద్యాధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :